- ప్రహాసనంలా మారిన డబుల్ బెడ్ రూం ఇళ్ళు
- నివాస గృహల కోసం నిరాహార దీక్షలు
- మంత్రి కొండా సురేఖ పైనే కోటి ఆశలు
*వరంగల్ జిల్లా ప్రతినిధి , ఏప్రిల్ 24 ( తెలంగాణ అనుక్షణం ) :* రాజకీయ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వ పాలకుల తాత్సారం , ప్రస్తుత ప్రభుత్వ పాలకుల అలసత్వం వెరసి వరంగల్ తూర్పు నియోజక వర్గ వర్కింగ్ జర్నలిస్టులకు శాపంలా మారాయి .ఒక ప్రహసనంలా తయారయ్యాయి .వినతులు చేసి విసిగిపోయిన జర్నలిస్టులు గత్యంతరం లేక గూడు కోసం గోసపాడుతూ రోడ్డెక్కారు .ఉండేందుకు నివాస గృహాలు అందించాలని కోరుతూ మండుటెండల్లో నిరసన నిరాహార దీక్షలకు పూనుకున్నారు .పేదల సొంతింటి కల నెరవేరుస్తామంటూ గత ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం ఆశావాహులకు కన్నీళ్లు తెప్పిస్తోంది . జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్ రూంల పంపిణి అటక ఎక్కేసింది . వరంగల్ దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్ షిప్ వద్ద సర్కార్ స్థలంలో గత బీఆర్ ఎస్ పార్టీ హయాంలో ప్రభుత్వం జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం హౌసెస్ పంపిణి జరగక నిరుపయోగంగా మారినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు . నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ 200 డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయం ఆలనాపాలనా లేక మందు బాబులు , పేకాట రాయుళ్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది .దీంతో అసాంఘిక శక్తులు డబుల్ బెడ్ రూం ల సముదాయంలోని ఇళ్ల కిటికీలు , తలుపులు, వాటర్ ట్యాంకులు , స్విచ్ బోర్డులను పగులగొట్టేశారు .బాత్ రూమ్ లని కంపు చేసారు . ఇళ్లకు చెందిన ఇనుము , కలపను దర్జాగా దొంగిలించారు .వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోనే ఇలా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టు స్పష్టంగా ఆనవాళ్లు కనిపిస్తుండడం బాధాకరమే కాదు అవమానకరం అని కూడా చెప్పొచ్చు. ప్రజాధనంతో నిర్మించిన ఈ ఇండ్లు వృథాగా ఉండటానికి బాధ్యులెవరు అనే కోణంలో పరిశీలిస్తే ...
*- అసలేం జరిగింది ....?*
ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా తూర్పు జర్నలిస్టుల కోసం దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్‌షిప్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం 12.60 కోట్లతో ప్రభుత్వం 200 డబుల్ బెడ్‌రూం ఇళ్ళను నిర్మించింది. 2021, ఏప్రిల్ 12న డబుల్ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణానికి అప్పటి ఐటీ, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశారు .తర్వాత అన్ని హంగులతో ఆ నివాస గృహల సముదాయం నిర్మాణం పూర్తి చేశారు .2023, జూన్ 17న అంగరంగ వైభవంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి అప్పటి రాష్ట్ర మంత్రి తారక రామారావు చేతుల మీదుగా 200 డబుల్ బెడ్‌రూం ఇళ్ళను ప్రారంభించారు .లాంఛనంగా కొందరు జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని అప్పగించారు .ఈ కార్యక్రమంలో అప్పటి రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారు .అక్కడి వరకు బాగానే ఉన్నా ఆపై పూర్తి స్థాయిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాన్ని జర్నలిస్టులకు అప్పగించడంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే సహా అధికారులు తాత్సారం చేసి విఫలం అయ్యారని చెప్పవచ్చు . ఈ లోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది .ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో డబుల్ బెడ్ రూమ్ ల విషయం కొన్నాళ్ళు పెండింగ్ పడింది .తమకు ఇళ్ళు ఇప్పించాలని కోరుతూ తూర్పు జర్నలిస్టులు స్థానిక ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేసి వినతులు అందించారు .అయినా కదలిక రాకపోవడంతో నిరసనగా రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు .పలువురు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, మేధావులు పాత్రికేయులకు సంఘీభావం తెలుపుతున్నారు .
*- మంత్రి కొండా సురేఖ పైనే కోటి ఆశలు ..*
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే , జిల్లా మంత్రి కూడా అయినా కొండా సురేఖ పైనే తూర్పు జర్నలిస్టులు కోటి ఆశలు పెట్టుకున్నారు . సురేఖ గతంలో తూర్పు నియోజక వర్గం నుండి ఐదేళ్లు ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించారు . ప్రస్తుతం కూడా తూర్పు ఎమ్మెల్యేగా , రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న కొండా సురేఖ కి ఇక్కడి జర్నలిస్టుల స్థితి గతులపై పూర్తి స్థాయి అవగాహన ఉంది .మంత్రి సురేఖ ప్రత్యేక శ్రద్ద వహించి పూనుకుంటే తమ సొంత ఇంటి కల నెరవేరుతుందని తూర్పు నియోజక వర్గ వర్కింగ్ జర్నలిస్టులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు .కాంగ్రెస్ ప్రభుత్వంలో నైనా తమ సొంతింటి కల సాకారం అవుతుందని తూర్పు జర్నలిస్టులు ఆశిస్తున్నారు .