గులాబీ సభ గుభాలించేనా ..?!

.   - నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ 
   - ఇటు  ఉగ్ర దాడి అటు వేసవి వేడి    
   -  జనసమీకరణ సాధ్యమయ్యేనా ..? 
    - మొదటినుండి ఇబ్బందులే ..! 
    -  కేసీఆర్ ప్రసంగం పై సర్వత్రా ఆసక్తి 
వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి , ఏప్రిల్ 26 ( తెలంగాణ అనుక్షణం ) :బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా నేడు ఆ పార్టీ రజతోత్సవ  మహాసభ జరగనుంది . సభా నిర్వహణకు సంబందించిన ఏర్పాట్లు సర్వం పూర్తి అయ్యాయి . తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడింది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి కావడంతో వరంగల్ లో భారీ బహిరంగ సభ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు . అయితే  ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో గులాబీల సభ గుభాలించేనా అనే సందేహం వ్యక్తం అవుతోంది .ఈ భారీ బహిరంగ సభకు వేలాదిగా జనం వస్తారని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే తాత్కాలిక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు .వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్ ను ఏర్పాటు చేశారు. ఇక ఎల్కతుర్తికి వచ్చే అన్ని రోడ్డు మార్గాల్లో చెత్తను, ముళ్లచెట్లను తొలగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ప్రతీ రోడ్డుకు ఇరువైపులా మొరం పోసి చదును చేశారు. సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు .పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు చేశారు .  వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు .మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. లైట్లు, ఎల్‌ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటుచేశారు. కేసీఆర్‌ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్‌ సిస్టంను చుట్టుపక్కల ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఏం మాట్లాడుతారోనని అటు పార్టీలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు .
 *- జన సమీకరణ సాధ్యమయ్యేనా  ..?*
బీ ఆర్ ఎస్ బహిరంగ సభకు మొదటి నుండి ఇబ్బందులే ఎదురవుతున్నాయి . తొలుత సభ నిర్వహణకు పోలీసు అధికారులు  అనుమతి ఇవ్వలేదు . దీంతో ఆ పార్టీ హై కోర్టులో పిటిషన్ వేసి   అనుమతి పొందింది . అలాగే సభా నిర్వహణ స్థలం కూడా మార్చారు . ఇదిలా ఉండగా బీ ఆర్ ఎస్ పార్టీ రజితోత్సవ మహా సభకు భారీ ఏర్పాట్లు చేసింది . అయితే ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితులల్లో జన సమీకరణ సాధ్యమయ్యేనా అని సర్వత్రా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి . పహల్ గాం లో ఉగ్రవాదుల దాడిలో 28 మంది అమాయకులు బలి కావడంతో దేశ వ్యాప్తంగా విషాదం నెలకొంది .అన్ని రాజకీయ పార్టీలు భాధిత మృతులకు సంతాపం ప్రకటిస్తూ సభలు , క్రొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నాయి . మరోవైపు ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై యుద్దానికి సిద్ధమవుతోంది . మరోవైవు వేసవి ఎండలు తీవ్రత పెరిగి వాతావరణం  బగ్గుమంటోంది . తెలంగాణాలో పదుల సంఖ్యలో వడ దెబ్బ తగిలి మృతి చెందారు . దీంతో సామాన్య ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు . ఇక ప్రస్తుతం  బీ ఆర్ ఎస్ పార్టీ అధికారానికి దూరమై ప్రతిపక్షంలో ఉంది . దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు , కీలక నేతలకు జన సమీకరణ కాస్తా కష్టసాధ్యమే అని అంటున్నారు . అంతే కాక అధికార కాంగ్రెస్ పార్టీ  ఈ మహా సభ సక్సెస్ కాకుండా శక్తి మేర ప్రయత్నాలు చేస్తుందని అనుమానాలు కూడా ఉన్నాయి .  ఈ నేపథ్యంలో గులాబీల సభ గుభాలించేనా అనే సందేహం బయటి వారితో పాటు ఆ పార్టీ వర్గాల్లో కూడా కనిపిస్తోంది .ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ విషయం  చర్చనీయంశంగా మారింది .

Comments