- ఆలస్యంగా మహాసభకు రాక
- పార్టీ కార్యాలయానికి రాని వైనం
- పెదవి విరుస్తున్న సొంత పార్టీ శ్రేణులు
*హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 28 ( తెలంగాణ అనుక్షణం ) :*హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి లో జరిగిన బీ ఆర్ ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి ఆ పార్టీ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ వ్యవహార తీరుపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి . ఆదివారం జరిగిన సభ తీరు చూసిన వారు ఓటమి తర్వాత కూడా కేసీఆర్ లో ఇసుమంత మార్పు రాలేదని అంటున్నట్టు తెలుస్తోంది . సిల్వర్ జూబ్లీ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ జరుపుకుంటుంటే కనీసం పార్టీ కార్యాలయానికి రావాలన్న స్పృహ కూడా కేసీఆర్ లో కనిపించలేదు . తాను పెట్టిన పార్టీ ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేసీఆర్ స్వయంగా వచ్చి పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేస్తారనుకుని ఆశించిన ఆ పార్టీ శ్రేణులు బంగపడినట్టు సమాచారం . ఆ బాధ్యతను తన కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించారు .లక్షలాది మంది నిరీక్షిస్తున్నా సభకు కేసీఆర్ గతంలో లాగానే ఆలస్యంగా ఆరున్నర గంటలకు కానీ చేరుకోలేదని కార్యకర్తలు అనుకున్నట్టు చెపుతున్నారు . వరంగల్ లో వేల మంది కార్యకర్తలు, నేతలు వచ్చి నిరీక్షిస్తుంటే ముందుగా వచ్చి కార్యకర్తలను పలుకరించాలన్న ధ్యాస ఆయనకు లేకుండా పోయిందని కింది స్థాయి పార్టీ శ్రేణుల విమర్శలు కూడా వినపడుతున్నాయి. ఎన్నికలలో ఓటమి తర్వాత ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితమయిన కేసీఆర్ బయటకు రావడమే మానుకున్నారు .అదేమంటే ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి కదా అని జవాబు ఇచ్చారు . దీంతో పాటు అన్యాయంగా కేసులు పెడితే సహించబోమని అన్న కేసీఆర్ నాడు ధర్నా చౌక్ లో కూడా ఆందోళనలు చేయకుండా ధర్నా చౌక్ ను ఎత్తివేసింది నిజం కాదా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు . కేసీఆర్ తన ప్రసంగంలో తాము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ బంగారంలా ఉండేదని, ఇప్పుడు పూర్తిగా దానిని మట్టిమయం చేశారని కాంగ్రెస్ పై ఆరోపణలు చేశారు. అంతవరకూ బాగానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అసలు ఏమీ అమలు చేయలేదని చెప్పడం ఏంటని హస్తం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర సమయంలోనే ఇచ్చిన హామీల్లో చాలా వరకూ పూర్తి చేశామని సీ ఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు అంటున్నారు . దీంతో పాటు కేసీఆర్ ప్రసంగంలోమునుపటిలా పస తగ్గినట్లే కనిపించిందని ప్రజలు అనుకోవడం గమనార్హం . ఈసారి పంచ్ డైలాగులు లు లేవు . ఆరోపణలు తప్ప .ఏదో నలభై నిమిషాలు మాట్లాడి అలా వెళ్లిపోయారు తప్పించి కొత్తగా కేసీఆర్ చెప్పిందేమీ లేదని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నట్టు తెలుస్తోంది . ఈ మాత్రం దానికి సిల్వర్ జూబ్లీ వేడుకల పేరిట ఇంత స్థాయిలో ఏర్పాట్లు చేస్తే ఉస్సూరుమనిపించి వెళ్లారని సభకు వచ్చిన కార్యకర్తలే అనుకోవడం వాస్తవమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సభ జరిగిన తీరు ముందు.. తర్వాత పరిశీలిస్తే కేసీఆర్ లో ఎలాంటి మార్పు రాలేదని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది . ఆయనకు ఓపిక లేదని, ఇన్ని లక్షలమంది సభకు వచ్చినా ఆయన సమయానికి రాకపోవడమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా స్క్రిప్ట్ చూసి చదవడంపై కూడా సోషల్ మీడియాలో సెటైర్లు సైతం వినిపిస్తున్నాయి . కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చు. అది రాజకీయాల్లో సహజమే. కానీ సొంత పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నాన్ని కేసీఆర్ చేయలేకపోయారంటున్నారు . ఇంత పెద్ద సభ జరిగినా ఆయన రావడానికి తీరిక, సమయం లేకపోతే రేపు సచివాలయానికి వస్తారన్న గ్యారంటీ ఏంటని పలువురు సోషల్ మీడియాలో బాహాటంగా ప్రశ్నిస్తున్నారు . ఇంత జరిగినా కారు సారు తీరు మారలేదని సొంత పార్టీ కార్యకర్తలు సహా సభకు హాజరైన ప్రజలు కూడా అనుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది .